థొరాకోస్కోపీ, ల్యాపరోస్కోపీతో రెండు క్లిష్టమైన ఆపరేషన్లు సక్సెస్!
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం!
ఆధునిక వైద్య పరిజ్ఞానంతో క్లిష్టమైన ఆపరేషన్లు.. రోగులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్య బృందం!
కర్నూలు వైద్యం, నవంబర్ 04,(సీమకిరణం న్యూస్):
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో ఒకే వేదికపై రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ వైద్య సేవల సామర్థ్యాన్ని నిరూపించారు. ఆదోనికి చెందిన 52 ఏళ్ల ఇక్బాల్ బాషా డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా సమస్యతో బాధపడుతుండగా, ఆయనకు ఆధునిక థొరాకోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. అదేవిధంగా గూడూరుకు చెందిన 32 ఏళ్ల మసూం మియా రోడ్డు ప్రమాదంలో ప్లీహం (స్ప్లీన్) తీవ్రంగా దెబ్బతినడంతో, ఆయనకు ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు శస్త్రచికిత్సలను సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో సర్జరీ, మత్తుమందు విభాగాల వైద్య బృందాలు సమన్వయంతో చేపట్టాయి. శస్త్రచికిత్సల అనంతరం ఇద్దరు రోగుల ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉండటంతో కోలుకుంటున్నారు. ఈ ఆపరేషన్లలో సర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి, పీజీ వైద్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ తేజ, డాక్టర్ ఆంచల్, డాక్టర్ సోమశేఖర్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా మత్తుమందు విభాగం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ రామ్ శివ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీ ప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుధీర్, డాక్టర్ శివ తమ సేవలను అందించారు. ఈ సందర్భంగా సర్జరీ విభాగాధిపతి డాక్టర్ హరిచరణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ స్థాయి అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఈ విజయాలు మరోసారి నిరూపించాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ముందంజలో ఉందని ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

