అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు
కర్నూలు క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పోలకల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ, అక్కడి భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, పోలీసు బందోబస్తుపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా..
సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, అవసరమైన పోలీసు బలగాలను అందుబాటులో ఉంచుకోవాలని ఎస్పీ సూచించారు. గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ చేపట్టడంతో పాటు రూట్ మార్చ్‌లు నిర్వహించి ప్రజల్లో భద్రతపై భరోసా కల్పించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.
ఓటర్లకు భద్రత కల్పించాలి…
ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో కోడుమూరు సీఐ తబ్రేజ్, సి. బెళగల్ ఎస్‌ఐ వేణుగోపాల రాజు, గూడూరు ఎస్‌ఐ రాజా కుళాయప్ప పాల్గొన్నారు.

