రీకౌంటింగ్ పేరుతో అక్రమాలు జరిగాయి!
59 ఓట్ల మెజారిటీతో గెలిచానని ప్రకటించి.. తర్వాత ఫలితం మార్చేశారు
మంత్రి టీజీ భరత్ ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని వైసీపీ అభ్యర్థి ఆరోపణ
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 04, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలోని జోహారాపురం 23వ వార్డు ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్. వెంకటరమణ ఆరోపించారు. రీకౌంటింగ్ పేరుతో తన విజయాన్ని తారుమారు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. తొలుత జరిగిన ఓట్ల లెక్కింపులో తాను 59 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారని తెలిపారు. అయితే ఆ తర్వాత మంత్రి టీజీ భరత్ ఒత్తిడితో రీకౌంటింగ్ నిర్వహించి, టీడీపీ అభ్యర్థి 35 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారని వెంకటరమణ విమర్శించారు. మంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి ఫిర్యాదు చేసి, 23వ వార్డు ఓట్ల లెక్కింపుపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనల ప్రకారం మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

