క్రాప్ ఇన్సూరెన్స్ గడువు ఆగస్టు 15 వరకు పొడిగించాలి : సీపీఐ – ఏపీ రైతు సంఘం
ప్రభుత్వ భూముల డి-పట్టా రైతులకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలి
సీపీఐ – ఏపీ రైతు సంఘం డిమాండ్
వెల్దుర్తి, జూలై 20, (సీమకిరణం న్యూస్):
ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని, ప్రభుత్వ భూములపై డి-పట్టాలతో సాగు చేస్తున్న రైతులకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వెల్దుర్తి ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో చంద్రశేఖర్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ, రైతు సంఘం మండల నాయకుడు డి. రాజు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి, ఉల్లి, వేరుశనగ, పత్తి, మిరప, మొక్కజొన్న, కంది, టమోటా, సజ్జ, కొర్ర, జొన్న, రాగి తదితర పంటలను రైతులు విస్తృతంగా సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై 15తోనే వేరుశనగ, పత్తి పంటల ఇన్సూరెన్స్ గడువు ముగించడం అన్యాయమని, దానిని ఆగస్టు 15 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే టమోటా పంటను కూడా క్రాప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలని, పంట రుణాలు తీసుకున్న రైతుల తరఫున బ్యాంకులే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న మీ సేవ, సీఎస్సీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడంతో పాటు, ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు శివ, పామప్ప, రంగముని, చంద్రప్ప, గురుపాదయ్య తదితరులు పాల్గొన్నారు.

