‘తల్లికి వందనం’ ఆశ చూపి దోచేస్తారు..
నకిలీ లింకులతో జాగ్రత్త :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక
కర్నూలు క్రైం, జూలై 19, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకుల ద్వారా ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత జాబితాలు, ఖాతాల్లో నగదు జమ తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా వేదికగా అనుమానాస్పద లింకులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దు..
తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి లింకుల ద్వారా సైబర్ ముఠాలు బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటీపీలు (OTP), పాస్‌వర్డ్‌ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలకు పాల్పడతారని వివరించారు. లబ్ధిదారులు కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని పిలుపునిచ్చారు.
సచివాలయాలనే సంప్రదించాలి..
పథకానికి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా అధికారిక ప్రభుత్వ వేదికలను లేదా సంబంధిత స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయ కార్యాలయాలను, అధికారులను మాత్రమే సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
బాధితులు 1930 కి కాల్ చేయండి:
ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గానీ ఫిర్యాదు నమోదు చేయవచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

