భారతదేశం
ఓయ్-జక్కీ మహేష్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసున్న మైనర్ బాలికకు డబ్బు ఆశచూపి అక్రమంలో ఆమె నుంచి అండాలను సేకరించారు. ఈ దందా కోసం బాలిక వయసును ఏకంగా 25 ఏళ్లుగా మారుస్తూ నకిలీ ఆధార్ కార్డును కూడా సృష్టించడం సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే?
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక, తన స్నేహితురాలు పాలక్ అనే యువతితో కలిసి పెళ్లిళ్లలో వెయిట్రెస్‌గా పనిచేస్తుంది. ఈ కోరిక పాలక్, ఆమె తల్లి రింకీ కలిసి బాలికకు రూ. 35,500 ఇస్తామని ఆశ చూపారు. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి తప్పుడు సమాచారం ఇచ్చి, ఆమెను ఒప్పించారు. బాలికను లొంగదీసుకున్న నిందితులు సీమ అనే మహిళ వద్దకు తీసుకెళ్లారు. ఆమె కుమారుడు హిమాన్షు ఓ మొబైల్ యాప్ ద్వారా బాలిక ఆధార్ కార్డును ఎడిట్ చేసి.. ఆమె వయసు 25 ఏళ్లుగా, ఆమెకు పెళ్లయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం ఒక ఐవీఎఫ్ సెంటర్‌లో ఏజెంట్ సెంటర్‌గా పనిచేసే కల్పన సహాయంతో జనవరి 20న అక్రమంగా అండదాన ప్రక్రియను పూర్తి చేశారు.

పోలీసుల ఎంట్రీ .. ఐదుగురి అరెస్ట్
ఫిబ్రవరి 6న బాలిక తల్లి తన కుమార్తె కిడ్నాప్ అయిందని, ఒక ఐవీఎఫ్ సెంటర్‌లో బలవంతంగా ఆపరేషన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. రంగంలోకి దిగిన గంగా నగర్ డీసీపీ కుల్దీప్ సింగ్ విచారణ చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్లను పరిశీలించగా.. వివిధ వయసుల మహిళల ఫొటోలు కనిపించాయని, వీరు ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చట్టం ఏం చెబుతోందంటే?
భారతదేశంలోని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం, 2021 ప్రకారం అండదానం చేయడానికి కఠిన నిబంధనలు ఉన్నాయి. దాత వయసు 23 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అందాలను దానం చేయాలి. ఒకసారి 7 కంటే ఎక్కువ అండాలను సేకరించకూడదు. దాత వివాహిత అయి ఉండాలి. కనీసం ఒక సంతానం కలిగి ఉండాలి.
కానీ ఈ కేసులో నిందితులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక మైనర్ బాలికను బలిపశువును చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

