Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’

📰 Generate e-Paper Clip

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’

 

దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గనికి కొత్త గుర్తింపు

 

కర్నూలు జిల్లా బంగారు గనికి అధికారికంగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం

 

అమరావతి, జూలై 23, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’ గా మార్చింది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గనిగా గుర్తింపు పొందిన ఈ గని భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల సరిహద్దుల్లో ఈ బంగారు గని విస్తరించి ఉంది. మొత్తం 597.820 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గనిలో ప్రధానంగా బంగారాన్ని వెలికితీస్తున్నారు. దీంతో పాటు వెండి, రాగి, సీసం, జింక్ వంటి ఇతర ఖనిజాలను కూడా తవ్వుతున్నారు. బంగారం వెలికితీత కోసం జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం 30 సంవత్సరాల మైనింగ్ లీజును మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్‌లో గనిని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్‌లో వాణిజ్య బంగారం ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గని కావడంతో దీనికి ఉన్న జాతీయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ‘స్వర్ణగిరి’ అనే పేరు పెట్టారు. ‘స్వర్ణం’ అంటే బంగారం, ‘గిరి’ అంటే కొండ అని అర్థం. ఈ ప్రాంతంలో బంగారం లభించే కొండలు ఉండటంతో ఈ పేరు పెట్టారు. అంతేకాకుండా పురాతన కాలం నుంచే ఈ ప్రాంతంలో బంగారం వెలికితీసిన చారిత్రక నేపథ్యం కూడా ఈ పేరుకు ప్రత్యేకతను ఇస్తోంది. జొన్నగిరి ప్రాంతానికి సుదీర్ఘమైన ఖనిజ చరిత్ర ఉంది. ఇది ఈస్ట్రన్ ధార్వార్ క్రేటన్‌లోని జొన్నగిరి గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో పురాతన కాలం నాటి శిథిలాలు, రాళ్లను పగలగొట్టిన గుర్తులు, పాత తవ్వకాల ఆనవాళ్లు కనిపిస్తాయి. శతాబ్దాల క్రితమే ఇక్కడ బంగారం వెలికితీసినట్లు ఈ ఆనవాళ్లు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఖనిజ వనరులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దృష్టిని కూడా ఆకర్షించాయి. స్వర్ణగిరి గోల్డ్ మైన్‌లో ఓపెన్ పిట్ మైనింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మూడు దశల క్రషింగ్, బాల్ మిల్ గ్రైండింగ్, నెల్సన్ కాన్సంట్రేటర్ గ్రావిటీ సర్క్యూట్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. అలాగే సీఐఎల్ లీచింగ్, ఎల్యూషన్, ఎలక్ట్రో విన్నింగ్, డోరే స్మెల్టింగ్ వంటి ఆధునిక ప్రక్రియలతో కూడిన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును అధికారికంగా మార్చాలని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖేష్ కుమార్ మీనా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై మైనింగ్ ప్లాన్‌లు, చట్టపరమైన అనుమతులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ , పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ తదితర అధికారిక రికార్డుల్లో కూడా ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’ పేరును నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular