నా కుమారుడిపై అక్రమ కేసులతో రాజకీయ వేధింపులు
ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదు : మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల ప్రెస్‌మీట్.. రామోహన్రెడ్డికి అండగా ఉంటామని నేతల వెల్లడి
కర్నూలు ప్రతినిధి నజీర్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):
తన కుమారుడు రామోహన్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి రాజకీయంగా వేధిస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కర్నూలులోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ తమ ఇంటికి వచ్చిన పోలీసులు తన కుమారుడు రామోహన్రెడ్డిని తీసుకెళ్లి కేసులు నమోదు చేశారని తెలిపారు. సత్యనారాయణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో తన కుమారుడిపై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందని ఆమె ఆరోపించారు. తన కుమారుడికి, సత్యనారాయణకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలను రాజకీయ రంగు పులిమి కిడ్నాప్ కేసుగా మార్చారని శ్రీదేవమ్మ విమర్శించారు. డబ్బుల వ్యవహారంలో వాస్తవాలను పక్కనపెట్టి తన కుమారుడిని కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం…
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీదేవమ్మ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు.
తన భర్తను కోల్పోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆమె తెలిపారు. ఇలాంటి చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ నాయకుల సంఘీభావం..!
ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ మేయర్ బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరకులపాడు ప్రదీప్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. రామోహన్‌రెడ్డి వ్యవహారంపై వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

