జిల్లా కలెక్టర్ పేరు, ఫోటోతో నకిలీ ఫోన్ కాల్స్.. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి
డబ్బులు డిమాండ్ చేస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హెచ్చరిక
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 22, (సీమకిరణం న్యూస్) :
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేరు, ఫోటోను దుర్వినియోగం చేస్తూ కొంతమంది అపరిచిత వ్యక్తులు నకిలీ ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి హెచ్చరించారు. కలెక్టర్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగిస్తూ 8107487296 అనే ఫోన్ నంబర్ నుంచి పలువురికి కాల్స్ చేసి, రూ.30,000 వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ ఫోన్ నంబర్ జిల్లా కలెక్టర్ ఫోన్ నంబర్ కాదని, కలెక్టర్ పేరు, ఫోటోను ఉపయోగించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించే ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నకిలీ కాల్స్‌ను నమ్మవద్దు.. డబ్బులు పంపవద్దు
కలెక్టర్ లేదా ఇతర ప్రభుత్వ అధికారుల పేరుతో అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే వాటిని నమ్మవద్దని సూచించారు. సంబంధిత వ్యక్తుల గుర్తింపును అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధృవీకరించని వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ లేదా సందేశాలు అందినట్లయితే సంబంధిత ఆధారాలను భద్రపరచుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఇటువంటి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

