రూ.7.05 లక్షల దోపిడీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు!
నలుగురు నిందితుల అరెస్టు.. రూ.6.53 లక్షల నగదు, వస్తువులు స్వాధీనం
నంద్యాల క్రైమ్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):
భూమి రిజిస్ట్రేషన్ కోసం నగదుతో వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను కోవెలకుంట్ల పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.17 లక్షల నగదుతో పాటు దోపిడీ సొమ్ముతో కొనుగోలు చేసిన సెల్‌ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా అభినందించారు.
భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుండగా దోపిడీ..
ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన సాన లక్ష్మీదేవి, తన మరిది వెంకట్రాముడు, మామ నరసింహుడితో కలిసి ఈ నెల 14వ తేదీ ఉదయం భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్ కోసం కోవెలకుంట్లకు బయలుదేరారు. వీరు రూ.7,05,000 నగదును బ్యాగులో తీసుకుని మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, గుల్లదుర్తి గ్రామం దాటిన తర్వాత నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మరో మోటార్‌సైకిల్‌పై వెంబడించారు. వారి వాహనాన్ని అడ్డగించి, లక్ష్మీదేవి వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కిందపడటంతో వీపు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు..
నంద్యాల జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా పర్యవేక్షణలో కోవెలకుంట్ల సీఐ పి. హనుమంత నాయక్, ఎస్‌ఐ పి. మల్లికార్జున రెడ్డి తమ సిబ్బందితో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితులు ప్రయాణించిన మార్గం, నిందితులు పరారైన దిశలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో అక్టోబర్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు : –
1. బొబ్బేరి రాఘవేంద్ర అలియాస్ రఘు (45) – గుండ్లకుంట్ల గ్రామం, పెద్దముడియం మండలం, కడప జిల్లా.
2. ముల్లా నాగిరెడ్డి (32) – కొండపల్లి గ్రామం, ఉయ్యాలవాడ మండలం.
3. గొగ్గాటి వంశీ రెడ్డి (25) – కొండపల్లి గ్రామం, ఉయ్యాలవాడ మండలం.
4. మోర బోయిన చంద్రమౌళి అలియాస్ చంద్ర (36) – పెద్దయమ్మనూరు గ్రామం, ఉయ్యాలవాడ మండలం.
రూ.6.53 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..
పోలీసులు నిందితుల నుంచి రూ.6,17,000 నగదుతో పాటు దోపిడీ సొమ్ముతో కొనుగోలు చేసినట్లు తెలిపిన రూ.36,000 విలువైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మరో మూడు సెల్‌ఫోన్లు, పల్సర్ మోటార్‌సైకిల్, హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదు, కొనుగోలు చేసిన ఫోన్ కలిపి రూ.6,53,000 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసు సిబ్బందికి అభినందనలు..
ఈ కేసు దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ నాగన్న, సజ్జత్ అలీ, కానిస్టేబుళ్లు మాలిక్, సుధాకర్, మహిళా కానిస్టేబుల్ షాహిన తదితరులు పాల్గొన్నారు. వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా అభినందించారు.

