నేరాల నివారణకు ప్రజల సహకారం అవసరం : నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ
ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం
ప్రతి ఇంటి వద్ద నిఘా వ్యవస్థ తప్పనిసరి
పిల్లల కదలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం
కర్నూలు క్రైం, అక్టోబర్ 07, (సీమకిరణం న్యూస్) :
సమాజంలో నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణకు ప్రజల సహకారం ఎంతో కీలకమని నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కాలనీలు, నివాస ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాల నేపథ్యంలో ఇంటి యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సీసీ కెమెరాలు ప్రజల రక్షణకు రక్షణ కవచంలా పనిచేస్తాయని, వీటి ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు నేరం జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు పోలీసులకు బలమైన ఆధారాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి వద్ద, అపార్ట్మెంట్లలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, వారి కదలికలపై నిరంతరం దృష్టి సారించాలని విక్రమసింహ హితవు పలికారు. వీధుల్లో గానీ, ఇంటి పరిసరాల్లో గానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గమనిస్తే ఏమాత్రం అలసత్వం వహించకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలంతా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరిస్తూ, ముందస్తు భద్రతా చర్యలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

