కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, జూలై 24, (సీమకిరణం న్యూస్):
గత 25 ఏళ్లకు పైగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకే అంకితభావంతో పనిచేస్తోందని వెల్దుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, టీడీపీ నాయకుడు ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ తెలిపారు. శుక్రవారం వెల్దుర్తిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతోందన్నారు. మాజీ జడ్పీటీసీ ఈ.ఎల్. సంజన్న గౌడ్ నాయకత్వంలో ప్రజాసేవ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశామని పేర్కొన్నారు. తమ పెద్దమ్మ దేవమ్మను టీడీపీ తరఫున సర్పంచ్‌గా ప్రజల ఆశీర్వాదంతో గెలిపించుకున్నామని, అలాగే తన తండ్రి సంజన్న గౌడ్ను జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల మద్దతుతో గెలిపించుకున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు కేఈ ప్రభాకర్, కేఈ శ్యాంబాబు, అలాగే అప్పటి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి విజయానికి తమ కుటుంబం విశేషంగా కృషి చేసిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తనను వెల్దుర్తి సీహెచ్‌సీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా నియమించారని, అప్పటి నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని ప్రతి కార్యాలయాన్ని సందర్శించి సూచనలు చేశానని తెలిపారు. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కేసులు ఎదుర్కోవడంతో పాటు ఆస్తులను కూడా కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ టీడీపీ అభివృద్ధి కోసం తమ సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. తన పెద్దమ్మ దేవమ్మ సర్పంచ్‌గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్దుర్తి పర్యటనకు రావడం తమ కుటుంబానికి గర్వకారణమని అన్నారు. అలాగే శివశంకర్ గౌడ్‌కు మద్దిలేటి స్వామి దేవస్థానం బోర్డు కమిటీ సభ్యునిగా అవకాశం కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం, ప్రజాసేవ లక్ష్యంగా టీడీపీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ తెలిపారు.

