ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీలోని స్వర్ణ వార్డులు (వార్డు సచివాలయాలు), స్వర్ణ గ్రామాలు(గ్రామ సచివాలయం)లో కీలక మార్పు. రాష్ట్రంలో ఉన్న స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో అందుతున్న సేవలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందన్న నేపథ్యంలో వీటిపై పరిశీలన అవసరమని భావించిన ప్రభుత్వం (ap govt).. మూడంచెల వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ వ్యవస్ధలో ఉండాల్సిన అధికారులను కూడా నియమించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామాల్లో మూడంచెల వ్యవస్థను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లా, మండల, పట్టణ స్దాయిల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఈ వ్యవస్థ కోసమే ప్రత్యేకంగా 2778 అధికారులను ప్రభుత్వం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో నియమించింది. ఈ పర్యవేక్షణ అధికారులు వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చిన వారితో పాటు బదిలీలపై వచ్చిన వారూ ఉన్నారు.

స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలపై పర్యవేక్షణ చేసే అధికారులు ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు తీసుకోవాలి. ఆయా ఆఫీసుల్లో రెగ్యులర్ గా తనిఖీలు చేయాలి. పథకాలు అందరికీ సకాలంలో అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి తగిన సూచనలు ఇవ్వాలి. అలాగే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ఉద్యోగులు ముందస్తు అనుమతులు లేకుండా ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్లపై వెళ్లకుండా చూడాలి. దీనితో పాటు ఉద్యోగుల హాజరును కూడా పర్యవేక్షించాలి.

అలాగే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులకు ప్రభుత్వం పంపుతున్న డబ్బులకు సైతం బాధ్యత వహించాలి. ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే వాటిపై నివేదికలు పంపి చర్యలకు సిఫార్సు చేయాలి. అలాగే అదనంగా నుంచి వచ్చే మేరకు ఉద్యోగులపై చర్యల్ని అమలు చేయాలి. అలాగే ప్రతీ స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల్లో లాజిస్టిక్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం అమలు చేసే బాధ్యత వీరిదే.

