లక్ష్మీపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్..
672 మద్యం బాటిళ్లు స్వాధీనం
ముగ్గురు అరెస్ట్.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు
కర్నూలు క్రైమ్, అక్టోబర్ 10, (సీమకిరణం న్యూస్) :

రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ కె. రాఘవేంద్ర పర్యవేక్షణలో కర్నూలు రూరల్ సర్కిల్ సీఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉలిందకొండ ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి, కె. నాగలాపురం ఎస్‌ఐ అఖిల్, పోలీసు సిబ్బంది, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానితులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏరుకలి శేఖర్ వద్ద 144, ఏరుకలి తిమ్మయ్య వద్ద 384, ఏరుకలి సురేష్ వద్ద 144 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 672 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు, ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

