ఇంటి దొంగతనం కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా..
పొలాల్లో దాక్కున్న వారిని పట్టుకున్న పోలీసులు
కర్నూలు క్రైమ్, ఆగస్టు 30, (సీమకిరణం న్యూస్) :
నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.5 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూలై 6న కర్నూలు నగరంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్యనగర్–ఉల్చాల రోడ్డులో నివాసం ఉంటున్న జయంతి మహేశ్వర్ రెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 25 గ్రాముల బంగారు నగలు, 32 తులాల వెండి ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఇతర ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తును ఎస్సై చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి చాకచక్యంగా నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని పొలాల్లో దాక్కొని ఉన్న నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితులు
1. ఎరుకలి గంగా ప్రసాద్, తండ్రి: ఎరుకలి రామాంజనేయులు, వయస్సు 38 సంవత్సరాలు, తాడిపత్రి టౌన్.
2. ఎరుకలి శివప్రసాద్, తండ్రి: ఎరుకలి రామచంద్ర, వయస్సు 48 సంవత్సరాలు, తాడిపత్రి టౌన్.
3. కామ్లే కార్తిక్, తండ్రి: శ్రీనివాసులు, వయస్సు 32 సంవత్సరాలు, ఇందిరాగాంధీ నగర్, కర్నూలు.
4. ఎరుకలి రామాంజనేయులు, తండ్రి: ఎరుకలి సుంకన్న, వయస్సు 43 సంవత్సరాలు, పామిడి; ప్రస్తుతం గుత్తి, అనంతపురం జిల్లా.
నిందితుల వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, చిన్నపిల్లల ఉంగరాలు కలిపి మొత్తం 2.5 తులాల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన స్కూటీ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

