ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు..!
బిఎల్ఓ పేరుతో మోసం.. లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!
ఓటరు వివరాలంటూ ఓటిపి అడిగితే జాగ్రత్త..!
ఎన్నికల సంఘం పేరుతో కొత్త సైబర్ స్కామ్..!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 04, (సీమకిరణం న్యూస్):
ఓటర్ల జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎన్నికల సంఘం ప్రతినిధులమంటూ పరిచయం చేసుకొని, ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెబుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి, తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరుతూ బ్యాంకు ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, ఓటిపిలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులు, ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దు, డౌన్‌లోడ్ చేయవద్దు. చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాలంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సివివి, పాస్‌వర్డ్, ఓటిపి వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి అధికారిక ఎన్నికల సంఘం సేవలను మాత్రమే వినియోగించాలి. ఓటరు జాబితా సవరణ, పేరు తిరస్కరణ, వివరాల మార్పులు లేదా చేర్పులపై సందేహాలు ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ ఓ)ను నేరుగా సంప్రదించి వివరాలను ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా సంబంధిత అధికారుల ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలి.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు సమాచారం అందించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. “అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి రక్షణ” అని జిల్లా ప్రజలకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.

