గుండె నొప్పి వస్తే వెంటనే సీహెచ్‌సీకి రావాలి
‘గోల్డెన్ అవర్’లో చికిత్సతో ప్రాణాలను కాపాడుకోవచ్చు
వెల్దుర్తి సీహెచ్‌సీలో ఉచితంగా ఎలాక్సిన్ ఇంజెక్షన్ అందుబాటులో
వెల్దుర్తి, ఆగస్టు 29 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండల ప్రజలు గుండె లేదా ఛాతీలో నొప్పి కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)ని సంప్రదించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్ర రెడ్డి సూచించారు. శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల గుండె నొప్పితో చికిత్స పొందిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బాబ్జీ, ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ వరప్రసాద్‌తో కలిసి సూపరింటెండెంట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలను వెల్లడించారు. ప్రైవేట్ మార్కెట్లో సుమారు రూ.50 వేల వరకు ధర పలికే ‘ఎలాక్సిన్’ ఇంజెక్షన్ సీహెచ్‌సీలో రోగులకు ఉచితంగా అందుబాటులో ఉందని డాక్టర్ బాలచంద్ర రెడ్డి తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో గుండె సంబంధిత రోగులకు ఈ ఇంజెక్షన్ అందించి చికిత్స చేసినట్లు చెప్పారు. సీహెచ్‌సీలో ఈసీజీ సౌకర్యం అందుబాటులో ఉండటంతో గుండె నొప్పితో వచ్చే రోగులకు వెంటనే ఈసీజీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గుండెపోటు నిర్ధారణ అయిన వెంటనే వైద్యుల సూచన మేరకు అవసరమైన చికిత్స, ఇంజెక్షన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గుండెపోటు సంభవించిన సమయంలో ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందించడం అత్యంత కీలకమని డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. సకాలంలో వైద్యం అందితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని, ఈ సమయంలో అందించే చికిత్స ఎంతో కీలకమని వివరించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బాబ్జీ మాట్లాడుతూ.. ఇటీవల తనకు గుండెలో నొప్పి రావడంతో వెంటనే సీహెచ్‌సీకి వెళ్లానని, అక్కడ వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో కోలుకున్నట్లు తెలిపారు. వెల్దుర్తి సీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. గుండె లేదా ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.

