Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వందేళ్ల భూ సమస్యకు తెర... 500 కుటుంబాలకు ఇంటి పట్టాల మార్గం సుగమం

వందేళ్ల భూ సమస్యకు తెర… 500 కుటుంబాలకు ఇంటి పట్టాల మార్గం సుగమం

📰 Generate e-Paper Clip

22-ఏ నిషేధిత జాబితా నుంచి 8.10 ఎకరాల భూమి విముక్తి •

 

 

కలెక్టర్ డా. ఏ.సిరి చొరవతో శాశ్వత పరిష్కారం •

 

 

అధికారులను శాలువాలతో సత్కరించిన లబ్ధిదారులు

 

 

కర్నూలు ప్రతినిధి, జూలై 16, (సీమకిరణం న్యూస్) :

 

దాదాపు శతాబ్ద కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కల్లూరు మండలం చింతల ముని నగర్ భూ సమస్యకు జిల్లా యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపింది. సర్వే నంబర్ 448/ఏ3లోని 8.10 ఎకరాల ప్రభుత్వ భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో, అక్కడ నివసిస్తున్న 500 కుటుంబాలకు ఇంటి పట్టాలు పొందే మార్గం సుగమమైంది. 1982లో పట్టాలు ఉన్నప్పటికీ భూమి 22-ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో కొనుగోలు, విక్రయాలు జరపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆధ్వర్యంలో అధికారులు పరిష్కారం చూపారు. దీంతో ఆనందోత్సాహాలతో కలెక్టరేట్‌కు చేరుకున్న లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులను శాలువాలతో సన్మానించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి మరో 20 ప్రధాన భూ సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. పట్టా, ఇనాం, ప్రభుత్వ భూములతో పాటు 22-ఏ నిషేధిత జాబితాలోని లోపాలను సరిచేసి భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. రీ-సర్వేలో పాస్‌బుక్‌లు జారీకి ముందే ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

“మీ ఆనందమే మా సంతృప్తి”

లబ్ధిదారుల సన్మానంపై స్పందించిన కలెక్టర్, “సమస్యతో వచ్చారని భావించాను. కానీ సమస్య పరిష్కారమైన ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చారని తెలిసి ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.

“ఇన్నేళ్ల టెన్షన్ ఒక్కరోజులో పోయింది”

భావోద్వేగానికి గురైన లబ్ధిదారులు, “ఎన్నో ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగాం. ఆశలు వదిలేసుకున్న సమయంలో మా సమస్యకు పరిష్కారం లభించింది. ఇన్నేళ్ల మానసిక భారం ఒక్కరోజులో తొలగిపోయింది” అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular