రాబోయే ఏడు రోజులు తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, మే 20, (సీమకిరణం న్యూస్) :
వాతావరణ శాఖ హెచ్చరికలతో రాబోయే ఏడు రోజులు తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లు, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వేడి వాతావరణంలో అనారోగ్యం మరియు మరణాల నివారణ, ప్రజల రక్షణ, మరియు అత్యవసర సేవల కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వడగాలుల సన్నద్ధతపై ప్రజలకు చేయవలసినవి, చేయకూడని పనులపై అందుబాటులో ఉన్నచోట, ఎలక్ట్రానిక్ బోర్డులపై హెచ్చరికలు మరియు ప్రజా భద్రతా సందేశాలను ప్రదర్శించాలన్నారు.. బస్ స్టాండ్‌లు, మార్కెట్లు, కూడళ్లు, కార్మిక అడ్డాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆశ్రయ కేంద్రాలు మరియు ఇతర రద్దీ ప్రాంతాలలో తగినంత త్రాగునీటి ఏర్పాట్లు ఉండేలా చూడాలని, శీతలీకరణ షెల్టర్లు మరియు నీడ ఏర్పాట్లు, అవసరమైన చోట చలివేంద్రాలు, తాత్కాలిక నీటి కియోస్క్‌లు మరియు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, నీటి కొరత ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అత్యవసర పరిస్థితులలో స్పందించడం కోసం మున్సిపల్ కమిషనర్లు , జిల్లా పరిపాలన, వైద్య & ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, విద్య, అగ్నిమాపక సేవలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో మరియు వార్డు స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని,. రోజువారీ పర్యవేక్షణ కోసం వార్డు కార్యదర్శులు, పారిశుధ్య కార్యదర్శులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పట్టణ ప్రణాళిక సిబ్బంది, వార్డు వాలంటీర్లు / క్షేత్రస్థాయి కార్యకర్తలకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాలన్నారు. పట్టణ స్థానిక సంస్థలు వీధి జంతువులు మరియు పక్షుల కోసం తగిన బహిరంగ ప్రదేశాలు, పార్కులు, మార్కెట్లు మరియు ఇతర ప్రదేశాలలో నీటి గిన్నెలు / మట్టి కుండలను ఏర్పాటు చేయాలని, వాటిని శుభ్రంగా ఉంచి, క్రమం తప్పకుండా నింపేలా చూసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు , అధికారులు రాబోయే ఏడు రోజుల పాటు ప్రతిరోజూ సన్నద్ధతా చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని మరియు క్షేత్రస్థాయి అమలులో ఎలాంటి అలసత్వం ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

