కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. పోలీసులకు ఎస్పీ సూచనలు
గూడూరు, నవంబర్ 02, (సీమకిరణం న్యూస్):
రేపు జరగనున్న గూడూరు నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం గూడూరు నగర పంచాయతీ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గార్డ్‌ను తనిఖీ చేసి, సంబంధిత రికార్డులో సంతకం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్ఐ రాజకుళాయప్ప తదితరులు పాల్గొన్నారు.

