గణేశ్ మండపాలకు ఆన్లైన్లో అనుమతులు..!
ఒకే క్లిక్‌తో గణేశ్ మండపం అనుమతి!
సింగిల్ విండో విధానంలో అన్ని శాఖల అనుమతులు ఒకేచోట
మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
వెల్దుర్తి సీఐ యుగేందర్, ఎస్సై నరేష్
వెల్దుర్తి, సెప్టెంబర్ 03, (సీమకిరణం న్యూస్):
వినాయక చవితి వేడుకల సందర్భంగా గణేశ్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఆన్లైన్లో పొందేందుకు సింగిల్ విండో విధానాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్దుర్తి సీఐ యుగంధర్ తెలిపారు. గురువారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై నరేష్ తో కలిసి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెల్దుర్తి సీఐ యుగంధర్ మాట్లాడుతూ పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకే వేదిక ద్వారా పొందేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ్. నెట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించిన అనంతరం, అవసరమైతే మండపం ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన మార్పులు, ఇతర నిబంధనలపై నిర్వాహకులకు సూచనలు అందిస్తారు. వెల్దుర్తి పట్టణ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు నాలుగు రోజులపాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు మూడు రోజులపాటు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి గణేశ్ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అనంతరం వెల్దుర్తి ఎస్సై నరేష్ మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన, భక్తి శ్రద్ధల వాతావరణంలో నిర్వహించేందుకు భక్తులు, గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ విజ్ఞప్తి చేశారు.

