ఖరీఫ్ పంట నమోదు తప్పనిసరి –
ప్రతి రైతు నమోదు చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాష
వెల్దుర్తి మండలంలో పంట నమోదు పరిశీలన
కౌలు రైతులతో పాటు అన్ని రకాల భూముల సాగుదారులు నమోదు చేసుకోవాలని సూచన
వెల్దుర్తి, జూలై 07, (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి మండలంలోని బుక్కాపురం, కలుగొట్ల, పుల్లగుమ్మి, రామళ్లకోట గ్రామాల్లో జరుగుతున్న పంట నమోదు (Crop Registration) కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ భాష పరిశీలించారు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది, గ్రామ విఆర్ఓలతో సమావేశమై ఖరీఫ్‌లో పంట సాగు చేసిన ప్రతి రైతు పంట నమోదును తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలోని ప్రతి గ్రామ రైతు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనాం, దేవదాయ, వక్ఫ్, డి-పట్టా, రిజిస్టర్ పేపర్ల ఆధారంగా సాగు చేస్తున్న భూములతో పాటు కౌలు రైతులు సాగు చేస్తున్న భూములను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. పంట నమోదు చేసుకున్న రైతులు పంట నష్టపరిహారం, పంట బీమా, వ్యవసాయ రుణాలు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సంధ్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది రఫియా, శ్రావణ్, తనూజ, అరుణ్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.

