Saturday, May 9, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం

కడపలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

కడప మత సామారస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..!

 

కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

 

కడపలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం

 

జిల్లా ఎస్పీతో కలిసి.. జిల్లా శాంతి కమిటీ సమావేశం

 

కడప ప్రతినిధి, మే 09, (సీమకిరణం న్యూస్) :

 

కడప నగరం ఎప్పటి నుంచో మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చే దుష్టశక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కడప నగరంలోని అల్మాస్‌పేట సర్కిల్ వద్ద చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో.. శనివారం రాత్రి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తో కలిసి.. జిల్లాలోని అన్ని మతాల సంఘ పెద్దలతో జిల్లా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడప నగరంలో పరమత ద్వేషాలకు ఎప్పుడూ తావులేదని స్పష్టం చేశారు. రేపటి హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యువత ర్యాలీ చేపట్టే క్రమంలో కొన్ని అవాంఛిత పోస్టర్లు తెరపైకి రావడం, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగడం బాధాకరం అన్నారు. గతంలో కడప చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రధానంగా నగరంలోని అల్మాస్ పేటలోని సర్కిల్ కు ఒక పెరును పెట్టుకునే విషయమై ఇరు మతాలకు చెందిన స్థానిక ప్రజలు చిన్నపాటి వాగ్వాదంతో ముందుకు రావడం, వారికి కొందరు స్వార్థపరులు వారివారి స్వంత ప్రయోజనాల కోసం అసాంఘిక దుష్ట శక్తులుగా రెచ్చగొట్టే చర్యలతో.. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించడం వల్లనే.. ఈ అవాంఛిత అల్లర్లు జరిగాయని స్పష్టం అవుతోందన్నారు. అల్మాస్ పేట సర్కిల్ కు సంబంధించి గత కొన్నేళ్లుగా ఒక పేరును ప్రతిపాదిస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి రికార్డులు కానీ, వినతులు కానీ అందిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. నగర పాలక సంస్థలో కూడా ఎలాంటి ప్రతిపాదన కానీ, ఆమోదాలు కానీ లేవని స్పష్టం చేశారు. కుల, మత భేదాలకు అతీతంగా అన్నదమ్ముల్లా జీవించడం కడప సంస్కృతి అని, అలాంటి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. చిన్న చిన్న సున్నితమైన అంశాలను మతపరమైన ఘర్షణలుగా మలచే ప్రయత్నాలు చేయడం, అందులో యువత ప్రధాన భూమిక పోషించడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి సంఘటనలు కడప నగర ప్రతిష్టకు ఒక కళంకమని, సామాజికంగా ఇలాంటి చర్యలు వల్ల ఎలాంటి ప్రయోజనాలు వుండవన్నారు. ప్రజలు ఎవరూ వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం కడప ప్రత్యేకత అని, ఆ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. జిల్లా శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా మతసామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ… రాజకీయ ప్రయోజనాల కోసం మత ఘర్షణలను ప్రేరేపించడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐక్యతకు ప్రతీక అయిన కడపలో విద్వేషాలకు స్థానం లేదని, అల్లర్లకు పాల్పడిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రసారమై ప్రజలను తప్పుడు దోవ పట్టిస్తున్న వారు.. కేవలం వారి స్వంత, స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే మతాన్ని అడ్డు పెట్టుకుని అసాంఘిక ఆటలు ఆడుతున్నారని గుర్తించడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నంలో పోలీసు అధికారులు గాయపడటం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు యువతను దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులు, మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా అడ్వాన్సు లో ఉండడం, అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలతో పోస్టులు చేయడం, ప్రజలను పక్కదోవ పట్టించే బ్యానర్లు, ప్రచారాలు చేసే చర్యలపై పోలీసు యంత్రాంగం చట్టపరంగా వ్యవహరిస్తుందన్నారు. అల్మాస్ పేట సర్కిల్ కు ఏ ఒక్క మతపరమైన పేరు మార్పునకు కానీ, ఏ ఒక్క రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా గానీ పేరు మార్చుకునే హక్కు లేదని తేల్చి చెప్పారు. కడప గడ్డపై ఎప్పటికీ సామరస్యపు జెండానే ఎగరాలని, విద్వేషాలకు చోటు ఉండకూడదన్నారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు అల్మాస్ పేట సర్కిల్ కు సంబంధించి.. పేరు మార్పును ఆకాంక్షించే వారి తరపు అభిప్రాయాలను, సలహాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జిల్లాలోని హిందు, ముస్లిం మత పెద్దలు సామాజిక సంఘాల పెద్దలైన శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular