Sunday, August 23, 2026
ads
📄 ePaper
Homeఅంతర్జాతీయంఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

📰 Generate e-Paper Clip

రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులకు అవకాశం

 

5 వేల మందికి ప్రత్యక్షంగా 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి

 

రానున్న 2–3 ఏళ్లలో అన్ని ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేసి డ్రోన్ తయారీ ప్రారంభం

 

డ్రోన్ సిటీ అభివృద్ధికి 3నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

 

టెస్టింగ్, శాండ్‌బాక్స్, ఎయిర్‌స్పేస్ అనుమతుల కోసం ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు

 

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

 

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 18, (సీమకిరణం న్యూస్):

ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రోన్ తయారీ, పరిశోధన, పరీక్షలు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు డ్రోన్ సిటీలో డ్రోన్ పరిశ్రమలకు చెందిన సుమారు 150 మంది సీఈఓలు, సీఎక్స్ఓలు, సీఎఫ్‌ఓలు, ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కేంద్ర మంత్రి మాట్లాడుతూ…భవిష్యత్‌లో డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషించనుందని, డ్రోన్ల తయారీతో పాటు వాటి వినియోగానికి సంబంధించిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఓర్వకల్లు డ్రోన్ సిటీలో ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి, సుమారు రెండేళ్ల క్రితమే అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించి ఈ రంగంలోని అపార అవకాశాలను గుర్తించారని కేంద్ర మంత్రి తెలిపారు. డ్రోన్ల తయారీ, వినియోగం, పరిశోధన, సేవలు, శిక్షణ తదితర అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓర్వకల్లులో 600 ఎకరాలను డ్రోన్ సిటీ కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కలిసి డ్రోన్ సిటీని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మొదటి దశలో 12 ప్లాట్లలో 8 ప్లాట్లను డ్రోన్ కంపెనీలకు కేటాయించామని, సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో వివిధ కంపెనీలకు స్థలాలు కేటాయించి తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో డ్రోన్ పరిశ్రమకు చెందిన సుమారు 150 కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, డ్రోన్ కార్పొరేషన్ తరఫున డ్రోన్ సిటీ అభివృద్ధి, రాష్ట్ర డ్రోన్ పాలసీ, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపు విధానం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కంపెనీల ప్రతినిధులకు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. దేశంలోని హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక డ్రోన్ కంపెనీలు ఓర్వకల్లు డ్రోన్ సిటీని పరిశీలించిన అనంతరం తమ విస్తరణ కార్యకలాపాలను ఇక్కడే చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. డ్రోన్ కంపెనీలను ఒకే ప్రాంతంలో క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సానుకూల ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. డ్రోన్ పరిశ్రమ ప్రతినిధుల నుంచి సమావేశంలో కీలకమైన సూచనలు, అభిప్రాయాలను స్వీకరించినట్లు మంత్రి తెలిపారు. డ్రోన్ తయారీ యూనిట్లు ఏర్పాటైన అనంతరం ఉత్పత్తి చేసిన డ్రోన్లను పరీక్షించి ధ్రువీకరించేందుకు టెస్టింగ్, శాండ్‌బాక్స్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కంపెనీలు కోరినట్లు చెప్పారు. అదేవిధంగా డ్రోన్లను గగనతలంలో పరీక్షించే సమయంలో అవసరమైన ఎయిర్‌స్పేస్ అనుమతులు, వివిధ ఆమోదాలను వేగంగా పొందేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పరిశ్రమ ప్రతినిధులు సూచించారని తెలిపారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. డ్రోన్ సిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమన్వయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పునీత్ కన్సల్, DGCA, QCIతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖల అధికారులను సమావేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డ్రోన్ పరిశ్రమకు అవసరమైన టెస్టింగ్, సర్టిఫికేషన్, ఎయిర్‌స్పేస్ అనుమతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, మూడు నెలల కాలపరిమితిలో అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యతను గుర్తించి దేశీయ తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. భారత యువత, దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోనే డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. డ్రోన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. దేశీయ డ్రోన్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీని కేవలం ఒక పరిశ్రమగా కాకుండా ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడే సాంకేతికతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణ, పురుగుమందుల పిచికారీ వంటి కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్యం, శాంతిభద్రతల పర్యవేక్షణ, భూసర్వే, విపత్తుల నిర్వహణ, మౌలిక వసతుల పరిశీలన తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోందన్నారు. వైద్య రంగంలో రక్త నమూనాలు, మందులు తదితరాలను వేగంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశంలో ప్రతి గ్రామానికి కనీసం ఒక డ్రోన్ అవసరమయ్యే స్థాయిలో భవిష్యత్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా డ్రోన్ల అవసరం ఉండగా ప్రస్తుతం 40 వేలకుపైగా డ్రోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ భారీ మార్కెట్‌ను దేశీయ తయారీ ద్వారా సద్వినియోగం చేసుకోవడం, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడం, డ్రోన్ ఆధారిత సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డ్రోన్ తయారీ, నిర్వహణ, ఆపరేషన్, సాంకేతిక సేవలతో పాటు డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో ఇప్పటికే కంపెనీల ద్వారా సుమారు రూ.130 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న కాలంలో డ్రోన్ పరిశ్రమ ద్వారా రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.డ్రోన్ సిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే సుమారు 5 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనివల్ల కర్నూలు ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు, సేవా రంగం, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో డ్రోన్ సిటీలో అన్ని ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేసి, డ్రోన్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. డ్రోన్ సిటీ రెండో దశలో డ్రోన్ల టెస్టింగ్, సర్టిఫికేషన్ తదితర అవసరాలకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ పరిశ్రమకు అవసరమైన అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించి ఓర్వకల్లును జాతీయ స్థాయి డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కర్నూలు విమానాశ్రయ అభివృద్ధిపై కూడా కేంద్ర మంత్రి పలు అంశాలను వెల్లడించారు. కర్నూలు నుంచి బెంగళూరుకు భవిష్యత్‌లో విమాన సేవలను ప్రారంభించే అంశంపై కృషి చేస్తానని తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) లను ఏర్పాటు చేయడం ద్వారా పైలట్ శిక్షణకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మెల్‌స్టార్ FTO ప్రారంభానికి సిద్ధంగా ఉందని, మరో ఓరియంట్ FTO కూడా ఏర్పాటు కానుందని తెలిపారు. FTOల ఏర్పాటుతో పైలట్ శిక్షణతో పాటు కర్నూలు ప్రాంతంలో ఉపాధి, వాణిజ్య, సేవా రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా, దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్  రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని చెప్పారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీ కేవలం డ్రోన్ తయారీ కేంద్రంగా కాకుండా తయారీ, పరిశోధన, పరీక్షలు, శిక్షణ, సర్టిఫికేషన్, సేవలు వంటి అన్ని విభాగాలతో కూడిన సమగ్ర డ్రోన్ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular