ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
విజయవాడకు చెందిన ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య (ఐలాపురం వెంకయ్య) ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన యస్సు 93 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తన ఇంట్లోనే కన్నుమూశారు. దీంతో విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం. ఆయనకి సీఎం చంద్రబాబు, జగన్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాప ప్రకటనలు చేస్తున్నారు.
పేద కుటుంబంలో పుట్టిన ఐలాపురం వెంకయ్య.. కష్టపడి ఎదిగారు. విజయవాడలోని ప్రముఖ ఐలాపురం హోటల్ ను స్థాపించి ఇప్పటిదాకా నడుపుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై 8 ఏళ్ల పాటు పనిచేశారు. బీసీల అభ్యున్నతి కోసం తీవ్రంగా పాటుపడ్డారు. అలాగే బీసీ ఫైనాన్స్ ఏర్పాటుకు కృషిచేశారు. సాలివాహన (కుమ్మర) సంఘం అధ్యక్షుడిగా కూడా దశాబ్దాల పాటు సేవలందించారు.

సామాజిక సేవల్లోనూ ఐలాపురం వెంకయ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసంస్థలకు గృహోపకరణాల విరాళాలు, విద్యార్థులకు ప్రోత్సాహక సాయాలు, మరికొన్ని సరఫరాలు, నిర్మాణాలు, అన్నదాన సత్రాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు అందించిన చరిత్ర ఆయనది. వెంకయ్యకు భార్య, కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించారు.

బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరంతరం పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారని గుర్తుచేసుకున్నారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఐలాపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అటు వైఎస్ జగన్ కూడా ఐలాపురం వెంకయ్య గారు ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వెంకయ్య కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ అన్నారు.

