ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ. ఆదివారం నాడు 81,894 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,754 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.91 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో అందిస్తున్నారు. ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ వంటి ముఖ్యమైన శాస్త్ర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో నిర్వహించేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది.

కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా కార్యక్రమాలు, ఫీజుల వివరాలు..
• వివాహం – ఉచితం
• ఉపనయనం – రూ.300
• సత్యనారాయణ వ్రతం – రూ.300
• కేశఖండన – రూ.200
• నామకరణం – రూ.200
• అన్నప్రాసన – రూ.200
• అక్షరాభ్యాసం – రూ.200
• వాహన పూజ – రూ.200
• చెవిపోగులు కుట్టడం – రూ.50
• చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100
• మేళం (ఒక సెట్) – రూ.100
• మేళం (రెండు సెట్లు) – రూ.300
• దస్త్ర పూజ – రూ.200
• ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200
భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘాన్ని సంప్రదించాలని సూచించింది.

