ఇతర మీడియా ప్రతినిధులను అవమానించే అధికారం ఎవరిచ్చారు?
పత్రిక పెద్దదైతే వ్యక్తిత్వం కూడా పెద్దదవుతుందా? జర్నలిస్టుల మధ్య గౌరవం లేదా?
వెల్దుర్తి, (సీమకిరణం ప్రత్యేక కథనం):
జర్నలిజం అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించడం. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న కొందరు తమ హోదా, తాము పనిచేస్తున్న పత్రిక పేరును అడ్డుపెట్టుకొని ఇతర మీడియా ప్రతినిధులను అవమానించేలా వ్యవహరించడం బాధాకరం. వెల్దుర్తిలో ఒక ప్రముఖ పత్రికకు చెందిన విలేకరి వ్యవహారశైలిపై ఇతర మీడియా ప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రెస్‌మీట్లతో పాటు మీడియా సమావేశాల వద్ద ఇతర పత్రికల విలేకరులు, జిల్లా స్థాయి పత్రికల ప్రతినిధులు, జర్నలిస్టులతో గౌరవంగా వ్యవహరించకుండా హేళనగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పత్రిక పెద్దదని ఇతర జర్నలిస్టులను చిన్నచూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం ఏ విధమైన జర్నలిజం? ఒక సంస్థలో పనిచేస్తున్నంత మాత్రాన ఇతర మీడియా ప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. నేటి మీడియా ప్రపంచంలో ప్రింట్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ వారి సంస్థ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరి వృత్తిని వారు గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుర్తుంచుకోండి.. పత్రిక పేరు గొప్పదై ఉండవచ్చు.. కానీ జర్నలిస్టు గొప్పతనం అతని ప్రవర్తనలో, వృత్తి నిబద్ధతలో కనిపించాలి. ప్రెస్‌మీట్లు ఎవరి సొంత వేదికలు కావు. అవి ప్రతి మీడియా ప్రతినిధికి సమానమైన వేదికలు. జర్నలిస్టుల మధ్య ఆధిపత్య ధోరణులు కాకుండా పరస్పర గౌరవం, ఐక్యత ఉండాలి. ఇతరులను గౌరవించలేని వ్యక్తి నుంచి వృత్తిపరమైన గౌరవాన్ని ఎలా ఆశించగలం? వెల్దుర్తిలో మీడియా ప్రతినిధులందరూ ఆత్మగౌరవంతో, ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పత్రికలు వేరు కావచ్చు.. కానీ జర్నలిస్టుల ఆత్మగౌరవం ఒక్కటే…!
— SK నజీర్
సీనియర్ జర్నలిస్ట్

