కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌ను కలిసిన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు
రాయలసీమ హక్కు, చారిత్రక నేపథ్యాన్ని వివరించిన సీనియర్ న్యాయవాది వై. జయరాజు
విభజన చట్టం సెక్షన్ 31(3)ను ప్రస్తావిస్తూ వినతి
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్):
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌ను, కర్నూలు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. సీనియర్ న్యాయవాదులు వై. జయరాజు, ఎ. రామసుబ్బారెడ్డి, సి. నాగేంద్రనాథ్, కపిలేశ్వరయ్య, చాంద్ బాషా, ఓంకార్‌తో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. చంద్రుడు, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, మహిళా ప్రతినిధి సుమన, రాయలసీమకు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వై. జయరాజు రాయలసీమ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యం, హైకోర్టు బెంచ్ అవసరాన్ని వివరించారు. హైకోర్టు అభ్యర్థన మేరకు జిల్లా యంత్రాంగం పంపిన మౌలిక సదుపాయాలు, వసతి లభ్యతకు సంబంధించిన నివేదికతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు పంపిన ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం–2014లోని సెక్షన్ 31(3)లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాలను కూడా ప్రస్తావించారు. పూర్తి స్థాయి హైకోర్టుకు బదులుగా కనీసం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న రాయలసీమ ప్రజల చిరకాల డిమాండ్‌ను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలని న్యాయవాదులు కోరారు. వినతిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తితో జరిగిన సమావేశం స్నేహపూర్వకంగా, ఫలప్రదంగా సాగిందని వారు పేర్కొన్నారు.

