Monday, August 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు

గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు

📰 Generate e-Paper Clip

గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు

 

డ్రగ్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులకు ప్రత్యేక పరీక్షలు

 

కర్నూలు క్రైమ్, ఆగస్టు 22, (సీమకిరణం న్యూస్):

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు కర్నూలు నగరంలో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్, ఫోర్త్ టౌన్ సీఐ విక్రమసింహ తమ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, సంకల్‌బాగ్, బస్టాండ్, ఎల్కూర్ బంగ్లా తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానిత యువకులను గుర్తించి, జిల్లా పోలీస్ శాఖకు అందజేసిన డ్రగ్ డిటెక్షన్ కిట్ల సహాయంతో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించినట్లు అనుమానం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలపై యువతకు పోలీసులు అవగాహన కల్పించారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 112, డయల్ 100 లేదా ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కర్నూలు పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular