పక్కా ప్లాన్‌తోనే ఇంతియాజ్ హత్య
వైసీపీ రౌడీ మూకల అరాచకాలను కూడా అణచి వేసేలా కఠిన చర్యలు తీసుకుంటాం
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 10, (మహా జ్యోతి న్యూస్ ) :
టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషా హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు కర్నూలులో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్నూలులోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ బాషా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని మంత్రి తెలిపారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని అప్పట్లో వైసీపీ వర్గీయులు ఇంతియాజ్‌ను బెదిరించారని, ఆయన ఇంటికి వెళ్లి గొడవకు దిగారని ఆరోపించారు. ఆ తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని చెప్పారు.
వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే హత్య
హంద్రీ నదిలో వైసీపీ కబ్జాలు, అక్రమాలను ఇంతియాజ్ బాషా బయటపెట్టారని మంత్రి పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నించినందుకే ఆయనను హత్య చేశారని ఆరోపించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని, వాటిలో వైసీపీ ప్రమేయం ఉందని మంత్రి ఆరోపించారు.
వారం రోజుల ముందే సోషల్ మీడియాలో హెచ్చరికలపై ప్రశ్న
ఇంతియాజ్‌ను చంపుతామని పరోక్షంగా వారం రోజుల ముందే సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ముందస్తుగా అంచనా వేయలేకపోయాయని మంత్రి ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పోలీసులు ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
నా కార్యాలయం ఎదుటే రెచ్చగొట్టే ర్యాలీలు
గతంలో తన కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే విధంగా ర్యాలీలు నిర్వహించారని టీజీ భరత్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, తన కార్యాలయం ఉన్న మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో నిరసనలు నిర్వహించేలా చూడాలని కోరినా వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
సీఎంకు కర్నూలు పరిస్థితులు వివరిస్తా
కర్నూలులో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వివరిస్తానని మంత్రి తెలిపారు. వైసీపీ ధోరణి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తీసుకువచ్చామని టీజీ భరత్ గుర్తు చేశారు. అవసరమైతే మళ్లీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. “ఫ్యాక్షన్ రాజకీయాలను అంతమొందించినట్లే.. ఇప్పుడు కర్నూలులో రౌడీ మూకల అరాచకాలను కూడా అణచివేసేలా కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

