యోనో లింక్ క్లిక్‌తో రూ.4 లక్షల సైబర్ మోసం…
బాధితుడికి పూర్తి నగదు తిరిగి అందజేసిన కర్నూలు పోలీసులు
గుజరాత్‌లో ఇద్దరు నిందితుల గుర్తింపు – ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టివేత
రికవరీ చేసిన రూ.4 లక్షలు బాధితుడు దండు నాగరాజుకు అప్పగింత
తెలియని లింకులు క్లిక్ చేయొద్దు..
సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి : ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, జూలై 17, (సీమకిరణం న్యూస్):
సైబర్ మోసానికి గురై రూ.4 లక్షలు కోల్పోయిన బాధితుడికి అదే మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి అందజేసిన కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. కర్నూలు పట్టణానికి చెందిన దండు నాగరాజు తెలియని యోనో యాప్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఆయన మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతా హ్యాక్ అయ్యాయి. దీంతో ఆయన ఖాతా నుంచి సుమారు రూ.4 లక్షలు వివిధ క్రెడిట్ కార్డులకు బదిలీ అయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సహకారంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల ఆచూకీని గుర్తించారు. నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహా ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీసస్ సభ్యులుగా ఉన్న ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వెళ్లి నిందితులు యాసిన్ యూసుఫ్ భాయ్ పిపాడ్వాలా, ఆవేశ్ యాసిన్ పిపాడ్వాలాలను గుర్తించి అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు చేపట్టింది. నిందితుల నుంచి సైబర్ మోసం ద్వారా అపహరించిన రూ.4 లక్షలను రికవరీ చేసి, అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం బాధితుడు దండు నాగరాజుకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజలు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

