పెట్రోల్ బంకుల వద్ద శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
పెట్రోల్, డీజిల్ కొరతపై తక్షణ చర్యలకు ఆదేశాలు
వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత
బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన హెచ్చరికలు
ఇంధన సంస్థలతో సమన్వయం – కొరత నివారణకు చర్యలు
జిల్లాలో 199 పెట్రోల్ బంకులు – సరఫరా పర్యవేక్షణ కట్టుదిట్టం
ఎక్కడా ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల ప్రతినిధి, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్) :

జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో, గత రెండు రోజులుగా జిల్లాలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సరఫరా అంతరాయంపై జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో ఇంధన కొరత సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధతో తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు పెట్రోల్ బంక్ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరగడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 199 పెట్రోల్ బంకులు ఉన్నాయని తెలియజేస్తూ, జిల్లాకు అవసరమైన ఇంధన నిల్వలను సమకూర్చేందుకు ఉన్నతాధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎక్కడా పెట్రోల్ లేదా డీజిల్ కొరత లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో సుమారు 40 శాతం పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, రైతులు మరియు వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు. ఇంధనాన్ని నిల్వ ఉంచి బ్లాక్ మార్కెటింగ్ చేయడం, లేదా సాధారణ వినియోగదారులకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ బంక్ యజమానులకు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారులు రవిబాబు, HPCL, BPCL, IOCL మరియు నయారా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

