హెరాల్డ్స్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఫాదర్ ఏసుబాబు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్):


80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగర శివారులోని ఇడ్లీ హోటల్ సమీపంలో ఉన్న హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఏసుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండాకు వందనం సమర్పించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ పౌలూస్, ఫాదర్ ఏసుబాబు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరియట్టతో పాటు ఉపాధ్యాయులు అనీ, నవీన, రేష్మా, విజయ, మరియళ్ళ, మాదోని, సింధ్య, భాగ్యలక్ష్మి, సులేఖ, బ్రదర్ రాహుల్ , విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

