Wednesday, July 1, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

📰 Generate e-Paper Clip

జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

 

నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాష

 

జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ (ఎన్‌సిఓఆర్‌డి) కమిటీ సమావేశం

 

నంద్యాల క్రైమ్, జూన్ 30, (సీమకిరణం న్యూస్):

జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఎస్. ఖాదర్ బాష పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మరియు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఎన్‌సిఓఆర్‌డి (మాదకద్రవ్యాల చట్ట అమలు సమన్వయంపై జాతీయ కమిటీ) సమావేశం అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, పోలీసు, విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ, రైల్వే, రవాణా, మహిళా మరియు శిశు సంక్షేమం, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేసి, 2026–2029 మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి శనివారం డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ చేయించడం, నెలవారీ అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే అన్ని విద్యాసంస్థల చుట్టూ 500 మీటర్ల పరిధిని మాదకద్రవ్య రహిత ప్రాంతంగా ప్రకటించి కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ అందించడంతో పాటు అవసరమైతే డీ-అడిక్షన్, పునరావాస కేంద్రాలకు పంపించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు మరింత పెంచాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పిఐటి ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1988 కింద కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్సైజ్, రైల్వే, రవాణా శాఖలతో సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీ-అడిక్షన్ కేంద్రాలను బలోపేతం చేయడం, శికారిపేట, సిద్ధాపురం, ఆలేబాద్ తండా, చెంచు కాలనీలు వంటి సున్నిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రతి శాఖ ఏడాది కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలవారీ పురోగతి నివేదికలు సమర్పించాలని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాష సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular