ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎం. హరికృష్ణ
వెల్దుర్తి, సెప్టెంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం, బాధితులకు న్యాయం అందించడంలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎం. హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు కర్నూలు రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజన్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కె. సందీప్‌కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థి దశ నుంచే పోరాటం..
ఎం. హరికృష్ణకు విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన అనుభవం ఉంది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్ లో పనిచేస్తూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ తనదైన ముద్ర వేశారు. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై స్పందిస్తూ ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
బాధితులకు అండగా..
ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, వివక్ష, అట్రాసిటీ కేసులు, బాధితులకు పరిహారం, పునరావాసం తదితర అంశాలపై మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణ చేస్తుంది. బాధితులకు సకాలంలో న్యాయం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం కమిటీ సభ్యుల బాధ్యతల్లో కీలకమైనది. ఈ నేపథ్యంలో హరికృష్ణ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.
గల్లీ నుంచి అధికారుల వరకు సమస్యలపై గళం…
ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో హరికృష్ణ గతంలోనూ చురుకుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సబ్ డివిజన్ మానిటరింగ్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయా వర్గాల సమస్యలను మరింత సమర్థంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించింది.
బాధ్యతకు న్యాయం చేస్తా..
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కర్నూలు ఆర్డీఓ, కమిటీ చైర్మన్ కె. సందీప్‌కుమార్‌కు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానన్నారు. హరికృష్ణ నియామకంపై బొమ్మిరెడ్డిపల్లె గ్రామస్థులు, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

