Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బానిస రాజకీయాలకు బైబై చెప్పండి... బాధ్యతగల పౌరులుగా నిలవండి!

బానిస రాజకీయాలకు బైబై చెప్పండి… బాధ్యతగల పౌరులుగా నిలవండి!

📰 Generate e-Paper Clip

బానిస రాజకీయాలకు బైబై చెప్పండి… బాధ్యతగల పౌరులుగా నిలవండి!

 

చేయి చేయి కలపండి… గుండ్రేవుల ప్రాజెక్టు సాధించండి!

 

నూతన రాజకీయ మార్పుతో తెలుగు రాష్ట్రాలకు బంగారు భవిష్యత్

 

ఓటుకు నోటు రాజకీయాలకు స్వస్తి పలకాలి

 

ప్రజల కోసం పోరాడే నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం

 

– జీరో బడ్జెట్ పాలిటిక్స్ నాయకుడు షేక్ నౌషాద్ పిలుపు

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 07, (సీమకిరణం న్యూస్ ):

 

బానిస రాజకీయ పార్టీలను వీడి, బాధ్యతగల పౌరులమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జీరో బడ్జెట్ పాలిటిక్స్ నాయకుడు షేక్ నౌషాద్ పిలుపునిచ్చారు. బానిస నాయకులను కాకుండా ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, ప్రగతిని కాపాడుకోవడానికి ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని కోరారు. నూతన రాజకీయ మార్పు ద్వారానే మెరుగైన, సంపన్న సమాజాన్ని నిర్మించగలమని నౌషాద్ పేర్కొన్నారు. ఓటుకు నోటు, విదేశీ పర్యటనలు, ఉచిత హామీలు వంటి ప్రలోభాలతో ప్రజలను ఆకర్షించే పాలకులతో నిజమైన అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సామాజిక స్పృహ, బాధ్యత, నిజాయితీ కలిగిన నాయకత్వంతోనే భద్రతతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.

 

కార్పొరేట్ రాజకీయాలపై విమర్శలు…

 

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కొనసాగుతున్న కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టీల పాలన సమాజానికి మేలు చేసేదిగా కనిపించడం లేదని నౌషాద్ విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల్లో నమ్మకం, భరోసా ఉండేదని, నేడు ప్రభుత్వం అంటే మాయ, దగా అనే భావన పెరుగుతోందని అన్నారు. అభివృద్ధికి తగిన ఫలితాలు లేకుండానే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై భారాలు మోపడం నేటి ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని ఆరోపించారు. అపారమైన సహజ, ఖనిజ సంపద కలిగిన భారతదేశంలో అత్యధిక ప్రజలు పేదరికం, నిరుపేదరికంతో జీవించడం పాలనా వైఫల్యానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. సామాన్యులకు అందని చట్టరక్షణ, సగటు పౌరుడికి అందుబాటులో లేని న్యాయం నేటి పాలనా వ్యవస్థలో ప్రధాన సమస్యలుగా మారాయని ఆయన అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఉచిత పథకాలు, ఆకర్షణీయమైన హామీలతో ఓట్లు సాధించి, అనంతరం ప్రజా సంపదను దోచుకోవడమే కొన్ని రాజకీయ పార్టీల విధానంగా మారిందని విమర్శించారు.

 

యువత మేల్కొనాలి…

 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న యువతీ యువకులు కూడా బానిస రాజకీయ పార్టీల చర్చల్లో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని నౌషాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేసి దేశానికి స్వేచ్ఛను సాధించారని గుర్తుచేశారు. వారి త్యాగస్ఫూర్తికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. మరోసారి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో దేశ నిర్మాణంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి బాధ్యతగల పౌరులు ఉన్నారని నిరూపించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు.

 

గుండ్రేవుల ప్రాజెక్టు కోసం ఐక్య పోరాటం చేయాలి..

 

కర్నూలు ప్రాంతంలో హంద్రీ, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని నౌషాద్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టు ముందుకు సాగకపోవడం విచారకరమన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా ప్రకటించిన ప్రభుత్వం పరిశ్రమలకు, రైతులకు భవిష్యత్తులో నీటిని ఏ విధంగా అందిస్తుందో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.

 

“చేయి చేయి కలుపుదాం… గుండ్రేవుల ప్రాజెక్టును సాధిద్దాం” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ భవిష్యత్తు కోసం అందరూ గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకు ఉద్యమించాలని కోరారు.

 

రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడే నాయకత్వం ఎక్కడ…?

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొందరు నాయకులు, పాలకులు పార్టీలు మరియు అధిష్ఠానాలకు బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని నౌషాద్ ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్‌కు వెళ్లే ప్రజాప్రతినిధుల్లో సొంత నియోజకవర్గాల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టసభల్లో ధైర్యంగా మాట్లాడే నిజాయితీ గల నాయకత్వం కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడం కంటే కార్పొరేట్ శక్తులు, కేంద్రాధిపత్య రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు, ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

 

కార్పొరేట్ మీడియా ధోరణులపై ఆందోళన

 

కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థల ధోరణుల కారణంగా తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని నౌషాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల కష్టాలు, సామాజిక సమస్యలు, పాలనా లోపాలు, విద్యా-వైద్య రంగాల్లో జరుగుతున్న దోపిడీలు, ఆర్థిక వ్యవస్థలోని అవకతవకలు వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజా వ్యతిరేక శక్తులను కూడా ప్రజానాయకులుగా చిత్రీకరించే స్థాయికి చేరడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. మీడియా తన సామాజిక బాధ్యతను గుర్తించి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వేదికలు అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు, అధికార వ్యవస్థల నిర్ణయాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విలువలు, సామాజిక బాధ్యత కలిగిన మీడియా సంస్థలను ప్రజలు, యువత ప్రోత్సహించాలని కోరారు.

 

రాయలసీమ ప్రజలను స్వావలంబన దిశగా నడిపించాలి

 

రాయలసీమ ప్రాంతంలోని పాలకులు తమ సొంత ప్రచారాలకే పరిమితమవుతూ ప్రజలను ప్రభుత్వ పథకాలపై ఆధారపడే పరిస్థితికి నెట్టివేస్తున్నారని నౌషాద్ విమర్శించారు. మౌనం, బలహీనత, భయం సమాజాన్ని మరియు కుటుంబ వ్యవస్థను ప్రమాదకరంగా వెంటాడుతాయని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన భవిష్యత్తు కావాలంటే, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే నూతన రాజకీయ మార్పు తప్పనిసరి అన్నారు. డబ్బు, బహుమతులు, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని తెలిపారు. బాధ్యతాయుతమైన ఓటుతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు సంపన్న సమాజ నిర్మాణానికి పునాది వేయగలరని పేర్కొన్నారు.

 

“బానిస రాజకీయాలను తిరస్కరిద్దాం… బాధ్యతగల పౌరులుగా నిలుద్దాం… నూతన రాజకీయ మార్పుతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును కాపాడుకుందాం” అని షేక్ నౌషాద్ పిలుపునిచ్చారు.

 

– షేక్ నౌషాద్

జీరో బడ్జెట్ పాలిటిక్స్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular