కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించాలి
• కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష
• రైతులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం
• కరువు పరిస్థితులపై వివరించిన శ్రీహర్ష
• పంటల బీమా చెల్లింపులు చేపట్టాలి
• గుండ్రేవుల డీపీఆర్ పనులు వేగవంతం చేయాలి
• రైతుల వలసలను అరికట్టాలి
కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 24, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో రైతులతో కలిసి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ కరువు నిర్వహణ విధానం మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లాను కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించే అధికారిక అంచనా ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. వర్షాభావంతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్కు వివరించారు. రైతుల వలసలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల తరఫున ప్రభుత్వం పంటల బీమా మొత్తాన్ని ముందుగా చెల్లించి, బీమా క్లెయిమ్ మొత్తం వచ్చిన అనంతరం సర్దుబాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పనులను వేగవంతం చేసి, ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లాలో రైతుల జీవనోపాధిని కాపాడేందుకు తక్షణ పరిపాలనా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేపియస్ సభ్యులు పులకుర్తి భాస్కర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాసులు, నౌషద్ భాష, సి,బెలగల్ పరమేష్, బి,తాండ్రపాడు వెంకటేష్, సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.

