గ్రామాలలో రైతులకు రీ సర్వే అవకతవకలు అరికట్టాలి : సిపిఐ
వెల్దుర్తి, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) :
గ్రామాలలో రైతులకు రీ సర్వే అవకతవకలు అరికట్టాలని రైతులను మోసం చేసే సర్వేయర్ లను సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల అధ్యక్షుడు డి రాజు, సిపిఐ మండల నాయకులు అనిల్ లు డిమాండ్ చేశారు. స్థానిక వెల్దుర్తి పట్టణంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎమ్మార్వో చంద్రశేఖర్ వర్మకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల అధ్యక్షుడు డి రాజు, సిపిఐ మండల నాయకులు అనిల్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో రైతుల భూముల రీ సర్వే చేపడుతున్నారు. చాలా గ్రామాలలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వలన గ్రామాల్లో భూముల సమస్యలు తగాదాలు జరుగుతున్నాయని ప్రతి పేద రైతు ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ ఉన్న రైతుకు డి పట్టా పాసుబుక్కు ఆన్లైన్లో ఎక్కించి రీ సర్వే ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. రీ సర్వే గ్రామాలలో తూతూ మంత్రంగా రీ సర్వే చేసి కొంతమంది గ్రామ సర్వేయర్లు రాజకీయ నాయకుల మాటలు విని గ్రామాల్లో సర్వే చేయకుండా కూడా చేశామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారు. అలా రైతులను మోసం చేసే సర్వేయర్ లను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సీమోను మహేష్ తదితరులు పాల్గొన్నారు.

