వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పవనాలు, ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో సోమవారం నుంచి వెండి ట్రేడింగ్ అతలాకుతలమైంది. భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోవడంతో ట్రేడింగ్ నిబంధనల ప్రకారం ‘లోయర్ అవి’ అమలై అమ్మకాలు తాత్కాలికంగా నిలిచిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మే నెల డెలివరీకి సంబంధించిన వెండి ఒప్పందాలు ఒకే రోజులో ఏకంగా 9 శాతం మేర క్షీణించాయి. కిలో వెండిపై సుమారు రూ. 20,409 మేర ధర తగ్గడంతో, ప్రస్తుతం ధర రూ. 2,06,363 వద్ద స్థిరపడింది. సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే వెండి, ఈ స్థాయిలో పతనం కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్ (COMEX)లో కూడా వెండి ఫ్యూచర్స్ ఔన్సుకు 9.34 శాతం తగ్గింది 63.15 డాలర్ల వద్దకు పడిపోయింది.

డాలర్ జోరు.. వెండి బేజారు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నప్పటికీ, వెండికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలపడటమేనని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువ పెరగడం, అమెరికా ట్రెజరీ బ్యాండ్ దిగుబడులు అధికమవ్వడంతో వడ్డీ లేని ఆస్తులైన వెండి, బంగారంపై పెట్టుబడిదారులు ఆసక్తి తగ్గించుకున్నారు. దీనివల్ల అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఈ లోహాలు భారీగా మారాయి.
ద్రవ్య లభ్యత కోసం అమ్మకాలు
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. స్టాక్ మార్కెట్లు మరియు ఇతర రంగాల్లో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు (మార్జిన్ కాల్స్) చాలా మంది ఇన్వెస్టర్లు వెండిలో ఉన్న తమ పెట్టుబడులను హుటాహుటిన ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పైకి తన్నే అవకాశం ఉంది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపును వాయిదా వేస్తాయన్న సంకేతాలు వెండి ధరలపై మరింత ఒత్తిడిని పెంచుతాయి.
పారిశ్రామిక డిమాండ్ పై నీలినీడలు
కేవలం పెట్టుబడిగానే కాకుండా, సోలార్ ప్యానెల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండికి ఉండే పారిశ్రామిక డిమాండ్ కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఏర్పడుతున్న భయాలతో పారిశ్రామిక అవసరాల కోసం వెండి కొనుగోళ్లు నిలిచిపోయాయి. వెండి మార్కెట్‌లో స్థిరంగా రావాలంటే డాలర్ విలువ తగ్గడం లేదా వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత రావడం అనివార్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

