Tuesday, November 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!

ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!

📰 Generate e-Paper Clip

ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటా!

 

మసీదు, షాదీఖానా నిధులపై ఆరోపణలు అవాస్తవం..

 

అల్లా, పవిత్ర ఖురాన్ సాక్షిగా వివరణ ఇచ్చిన మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్

 

సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్):

ముస్లిం సోదరుల సంక్షేమం, అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు. మసీదు అభివృద్ధి, షాదీఖానా నిధుల విషయంలో తనపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వెల్దుర్తిలోని పెద్ద మసీదును సందర్శించిన ఆయన స్థానిక ముస్లిం సోదరులతో సమావేశమై పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మసీదు వేదికగా అల్లా, పవిత్ర ఖురాన్ సాక్షిగా మాట్లాడుతూ.. ముస్లిం సోదరుల అభివృద్ధి విషయంలో తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. మసీదుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. రాజకీయాలకతీతంగా ముస్లిం సమాజం అభివృద్ధి కోసం పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

 

రూ.20 లక్షల మసీదు నిర్మాణ పనులకు పారదర్శక లెక్కలు

 

మసీదు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు జ్ఞానేశ్వర్ గౌడ్ వివరించారు. నిర్మాణ పనులకు సంబంధించిన కూలీల చెల్లింపులు, సిమెంట్, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి కొనుగోళ్ల వరకు ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయని తెలిపారు. నిధుల వినియోగంపై ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా వచ్చి వివరాలు పరిశీలించుకోవచ్చని, లెక్కలు చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

 

ముస్లింల ఆస్తుల పరిరక్షణకు అండగా నిలిచా..!

 

గతంలో ముస్లిం సోదరులకు చెందిన స్మశాన వాటిక స్థలంతో పాటు షాదీఖానా గదులను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించినప్పుడు వాటి పరిరక్షణ కోసం తాను గట్టిగా నిలబడ్డానని ఆయన గుర్తుచేశారు. ఆ ఆస్తులు ముస్లిం సమాజానికే చెందాలని పోరాడానని తెలిపారు. షాదీఖానా గదుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ముస్లిం సోదరులకే ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తులు, హక్కుల పరిరక్షణలో భవిష్యత్తులోనూ తన సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

 

ఎల్.ఈ. పుష్పావతికి ముస్లిం సోదరుల మద్దతు కోరిన జ్ఞానేశ్వర్ గౌడ్

 

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన సతీమణి ఎల్.ఈ. పుష్పావతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆమెకు ముస్లిం సోదరులు తమ సంపూర్ణ మద్దతు అందించి అఖండ మెజార్టీతో గెలిపించాలని జ్ఞానేశ్వర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. ముస్లిం సోదరుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సంక్షేమం, అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గౌడ్ పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular