ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూలై 31, (సీమకిరణం న్యూస్):
ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువు ఈరోజు జూలై 31తో ముగియాల్సి ఉండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 వరకు మరో 15 రోజులపాటు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన PMFBY నోటిఫికేషన్ ప్రకారం వరి మినహా అన్ని పంటలకు జూలై 31 వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు బీమా నమోదు గడువు నిర్ణయించబడగా, రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, బీమా సంస్థలతో విస్తృతంగా చర్చించి, వరి మినహా మిగిలిన అన్ని ఖరీఫ్ పంటలకు కూడా గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలు సానుకూలంగా స్పందించి, PMFBY కింద నోటిఫై చేసిన వరి మినహా అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, ఇతర అనుకోని పరిస్థితుల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందువల్ల రుణగ్రహీత, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల బీమాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా నమోదు చేయించుకుని భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా రక్షణ పొందాలని సూచించారు. రైతులు సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు,NCIP మొబైల్ యాప్ ద్వారా స్వయంగా లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, పోర్టల్‌పై చివరి రోజులలో ఏర్పడే రద్దీని నివారించేందుకు వీలైనంత త్వరగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

