భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడం చాలా మందికి కష్టంగా, టైం తీసుకునే ప్రక్రియగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ముందుగా పత్రాల విషయానికి వస్తే… ఇక అంతా కాగితాల బండి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆధార్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. డాక్యుమెంట్ల జాబితాను కూడా తగ్గించారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. పత్రాలు తప్పుగా లేదా పూర్తిగా అప్‌లోడ్ చేయకపోతే దరఖాస్తు నేరుగా తిరస్కరించబడుతుంది. కాబట్టి అప్లై చేసే సమయంలో జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం.

పోలీస్ వెరిఫికేషన్ విషయంలో కూడా మంచి మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు వారాల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారా అధికారుల మధ్య డేటా షేరింగ్ వేగంగా జరుగుతుంది. ఈ రోజుల్లో వెరిఫికేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ముందుగా పాస్‌పోర్ట్ జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ పూర్తి చేయడానికి కూడా అనుమతించబడుతుంది. అయినా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు.
పాస్‌పోర్ట్ కొత్త పోర్టల్..
ఇంకా ఒక ముఖ్యమైన విషయం.. కొత్తగా అప్‌లోడ్ చేసిన పాస్‌పోర్ట్ పోర్టల్. ఫారం నింపడం నుంచి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. రియల్ టైం మెసేజ్ అలర్ట్‌లు కూడా వస్తాయి. మధ్యవర్తుల అవసరం లేకుండా, ఇంటి దగ్గర నుంచే ఎక్కువ భాగం పూర్తిచేయవచ్చు.
పిల్లల పాస్‌పోర్ట్ విషయంలో కూడా కొంత సౌలభ్యం కల్పించారు. డిజిటల్ బర్త్ సర్టిఫికెట్, స్కూల్ ఐడీ, తల్లిదండ్రుల సింపుల్ కన్సెంట్ పత్రాలను సులభంగా అంగీకరిస్తారు. దీంతో మైనర్ల దరఖాస్తుల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనితో ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
మొత్తానికి ఈ కొత్త మార్పుల లక్ష్యం ఒక్కటే.. పాస్‌పోర్ట్ సేవను వేగంగా, సురక్షితంగా, సులభంగా అందించడం. ఫిబ్రవరి 15 తర్వాత అప్లై చేసే వారు కొత్త నిబంధనల ప్రకారం పత్రాలు సిద్ధం చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ చేసుకుంటారు.

