వెల్దుర్తి సర్పంచ్ పోరు రసవత్తరం!
నలుగురు అభ్యర్థులతో మారిన రాజకీయ సమీకరణాలు
టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు.. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థుల సవాల్
ఓటర్ల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
వెల్దుర్తి నజీర్, నవంబర్ 12 (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు పోటీకి సిద్ధం కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొమ్మన రవి రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో జ్ఞానేశ్వర్ గౌడ్ సతీమణి ఎల్.ఈ. పుష్పావతి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, కీర్తిశేషులు బొమ్మన శివశంకర్ రెడ్డి తనయుడు బొమ్మన రమకాంత్ రెడ్డి సైతం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తమకు కూడా ఎమ్మెల్యే మద్దతు ఉందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త తిరువీధి రమేష్ శెట్టి (టీవీ రమేష్) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.
టీడీపీలో ఇద్దరు అభ్యర్థులు.. రాజకీయ చర్చ
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీకి రావడం స్థానికంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందంటూ ఇరువర్గాలు పేర్కొంటుండటంతో టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పార్టీ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఓటర్ల తీర్పుపైనే అందరి దృష్టి..!
నలుగురు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ నేపథ్యం, గతంలో చేసిన సేవలు, గ్రామాభివృద్ధిపై ఇచ్చే హామీలు ఎన్నికల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థి బొమ్మన రవి రెడ్డి, టీడీపీ మద్దతు ఉన్న ఎల్.ఈ. పుష్పావతి, బొమ్మన రమకాంత్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి టీవీ రమేష్ శెట్టి మధ్య పోటీతో వెల్దుర్తి సర్పంచ్ ఎన్నికలపై ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది.
చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? ఏ అభ్యర్థి గ్రామ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు? అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

