గణేష్ నిమజ్జనానికి ‘పోలీస్’ పహారా!
1,700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
నగరంలో నేడు ట్రాఫిక్ మళ్లింపు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ
నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 21, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలో మంగళవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో నిమజ్జన బందోబస్తుకు హాజరయ్యే పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ సమావేశమై విధులపై దిశానిర్దేశం చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే విధులు నిర్వహించాలని, భక్తులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నిమజ్జన ఘాట్ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.
మూడు ప్రాంతాల్లో నిమజ్జన ఘాట్లు…
కర్నూలు నగరంలో 1,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయని, సాధారణంగా వినాయక్ ఘాట్‌లో నిమజ్జనం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తక్కువగా ఉండటంతో వినాయక్ ఘాట్‌తో పాటు నన్నూరు, ఉలిందకొండ ప్రాంతాల్లో అదనపు నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.మంగళవారం ఉదయం 9 గంటలకు వన్‌టౌన్ పరిధిలోని రాంభొట్ల దేవాలయం పరిసరాల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
1,700 మంది పోలీసులతో బందోబస్తు….
నిమజ్జన మార్గాలు, ఘాట్ల వద్ద కలిపి సుమారు 1,700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు బందోబస్తు కొనసాగుతుందని చెప్పారు. నన్నూరు, ఉలిందకొండ ప్రాంతాల్లో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని, పిల్లలు, వృద్ధులు నీటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు..
గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఉదయం నుంచి కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని ఎస్పీ తెలిపారు. భారీ వాహనాలకు నగరంలో అనుమతి ఉండదని, అవసరాన్ని బట్టి ప్రధాన రహదారులపై వన్‌వే విధానం అమలు చేస్తామని చెప్పారు. కొన్ని మార్గాల్లో ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
సీ క్యాంప్ నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున, హైవే దాటి గణేష్ ఘాట్‌కు వచ్చే మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్, భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
నిబంధనల మేరకే డీజేలు…
నిమజ్జన కార్యక్రమంలో డీజేలు నిబంధనలకు లోబడి నిర్వహించాలని, నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నంద్యాల ఏఎస్పీ సుస్మిత, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ, హోంగార్డులు, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

