వెల్దుర్తి పదోతరగతి విద్యార్థులు క్షేమంగా తిరిగి చేరిక
వెల్దుర్తి, ఫిబ్రవరి 04,( సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి పట్టణానికి చెందిన పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (స్నేహితులు) ఇటీవల తప్పిపోయిన ఘటనకు సుఖాంతం జరిగింది. గత నెల 31న తమ పిల్లలు కనిపించట్లేదని తల్లిదండ్రులు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం స్థానిక వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది.స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న షేక్ హుస్సేన్, షేక్ అబ్దుల్ హిమాన్లు స్నేహితులు.పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో బాగా చదవాలని తల్లిదండ్రులు మందలించడంతో భయపడి, ఇంట్లో చెప్పకుండా పాఠశాల నుంచే వెళ్లిపోయారు.రైలు ఎక్కి హైదరాబాద్కు చేరుకున్న వారు అక్కడ ఒక మసీదులో కొద్ది రోజుల పాటు ఉన్నట్లు తెలిసింది.వద్ద ఉన్న డబ్బులు ఖర్చైపోవడంతో హైదరాబాద్లో కొత్తగా జీవించడం ఎలా అన్న ఆందోళనకు లోనైన విద్యార్థులు చివరికి తిరుగు ప్రయాణమై బుధవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. విషయం తెలిసిన ఎస్సై నరేష్ తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి, విద్యార్థులను వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించారు.ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

