పాత్రికేయుల సేవలు సమాజానికి ఎంతో కీలకం : ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి
కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్):
కత్తి కన్నా కలం చాలా గొప్పదని ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి అన్నారు. సోమవారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయంలో పాత్రికేయుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ఘనత పాత్రికేయులకే దక్కుతుందన్నారు. పాత్రికేయుల వృత్తి ప్రయాణం కత్తి మీద సాములాంటిదని, ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడి వార్తలు అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే గ్రామంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ తిరువీధి రాంప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి, తమకు ఇంతటి గౌరవం అందించిన తిరువీధి రమేష్ శెట్టి, డాక్టర్ తిరువీధి రాంప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు చంద్రశేఖరరావు, చిరంజీవి, ఓమేంద్ర, ఈశ్వరయ్య, అమీర్ భాష, సీమకిరణం నజీర్, మారన్న, నజీర్, రాజశేఖర్, అశోక్, దస్తు, హరి, అంజి, శేఖర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

