వెల్దుర్తిలో హోరెత్తిన టీవీ రమేష్ ఎన్నికల ప్రచారం!
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. వెల్దుర్తిలో టీవీ రమేష్‌కు మద్దతుగా ప్రచారం!
పట్టణ పురవీధులు, పాత బస్టాండ్ మీదుగా సాగిన ప్రచార ర్యాలీ
కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, నవంబర్ 17 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త తిరువీధి రమేష్ శెట్టి (టీవీ రమేష్)కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ పురవీధులు, పాత బస్టాండ్ మీదుగా ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ నాయకుడు కొట్రికే పణిరాజ్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు టీవీ రాంప్రసాద్, టీవీ సుధేంద్ర తదితరులు ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలోని వ్యాపారస్తులను, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సర్పంచ్ అభ్యర్థి టీవీ రమేష్ శెట్టికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వెల్దుర్తిలో సుమారు 20 ఏళ్ల తర్వాత సర్పంచ్ స్థానం ఓసీ జనరల్ కేటగిరీకి రావడంతో ఆర్యవైశ్యులంతా ఐక్యంగా నిలిచి టీవీ రమేష్ శెట్టి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆర్యవైశ్యుల ఐక్యతను చాటడంతో పాటు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక వర్గానికి మరిన్ని అవకాశాలు లభించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టి మాట్లాడుతూ.. తాను పదవుల కోసం ఎన్నికల బరిలోకి రాలేదని, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తానని, ప్రజలు, యువకులు, కార్మికులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు, సహకారం అందించాలని కోరారు. ర్యాలీ ముగింపులో నాయకులు, కార్యకర్తలు “వాసవి మాతాకి జై”, “ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలి”, “అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువకులు, వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

