దొంగతనం కేసును ఛేదించిన 4టౌన్ పోలీసులు
పని మనిషి నుండి 15 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఎస్ఐ గోపినాథ్, ఎస్ఐ చంద్ర శేఖర్ లను అభినందించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, మే 02, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య దేవాలయం వద్ద గల వివేక్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణమూర్తి నాగేంద్ర అను అతని ఇంటిలో ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి 27 వ తేదీ మధ్యలో వారి ఇంటిలోని సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు మరియు 30 తులాల వెండి వస్తువులు కనిపించడం లేదని ఇంటికి తరుచుగా వచ్చే పనిమనిషి గాని లేదా కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చే వ్యక్తి గాని వీటికి కారణం అయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ కేసు నమోదు పరిచి దర్యాప్తులో భాగంగా అనుమానితులైన ఇద్దరినీ విచారించి అందులో దొంగతనానికి పాల్పడినది వన్ టౌన్ ఏరియాలో నివాసం ఉంటు ఫిర్యాది ఇంట్లో గత 3 నెలలుగా ఇంటి పని చేస్తున్న పనిమనిషి పర్వీన్ గా గుర్తించి, శనివారం సదరు పనిమనిషిని వారి ఇంటి వద్దనే అరెస్టు చేసి, విచారించి, ఆమె ఇంటిలో దొంగలించి దాచుకున్న 15 తులాల బంగారు ఆభరణాలు మరియు 30 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో చురుకుగా పని చేసి, రికవరీకి సహకరించిన ఎస్ ఐ గోపినాథ్, ఎస్ ఐ చంద్ర శేఖర్ మరియు పిసీ మురళి, హెచ్ సి జీనస్, పీసీ సుబ్బారాయడులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
ప్రజలకు 4వ పట్టణ పోలీసుల విజ్ఞప్తి

ఇళ్లలో పనిమనుషులు లేదా సహాయకులను నియమించుకునేటప్పుడు యజమానులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో పని మనుషులను పనిలో చేర్చుకునే ముందే సమీప పోలీస్ స్టేషన్ ద్వారా ‘పోలీస్ వెరిఫికేషన్’ చేయించుకోవాలని పనివారి పూర్తి చిరునామా, ఆధార్ కార్డు మరియు ఫోటోలను దగ్గర ఉంచుకోవాలన్నారు. విలువైన వస్తువులను బీరువాలో భద్రపరుచుకుని, తరచూ వాటిని తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఈ కేసును ఎస్ ఐ గోపినాథ్, ఎస్ ఐ చంద్ర శేఖర్ మరియు పిసీ మురళి, హెచ్ సి జీనస్, పీసీ సుబ్బారాయడులు విజయవంతంగా ఛేదించారు.

