హత్య కేసులో ముద్దాయిల అరెస్టు
వెల్దుర్తి, ఫిబ్రవరి 18, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 12న మాదాపురం గ్రామ సమీపంలోని శివారెడ్డి కోళ్ల ఫారంలో డోన్ పట్టణానికి చెందిన సురేష్ అనుమానాస్పద మృతి చెందిన ఘటన హత్యగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు నిర్ధారణ అయిందని సిఐ యుగంధర్, ఎస్సై నరేష్ తెలిపారు. బుధవారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లోని ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసులో డోన్ పట్టణానికి చెందిన అమ్రేష్ నాయక్, అల్లా బకాష్‌లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు రాడ్లు మరియు ఇతర మారు ఆయుధాలతో సురేష్‌పై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. గురువారం వారిని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. నిందితులపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే డోన్ పట్టణంలో నూర్ భాషా, పట్టా శేఖర్‌ల మధ్య జరిగిన గలాటా పెద్దమనుషుల సమక్షంలో సర్దుబాటు అయ్యింది. ఇరువురు ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సురేష్ వారిని చూసి నవ్వాడని, దానికి కోపగించిన నూర్ భాషా తమ్ముడు అల్లా బకాష్ ప్రతీకారంతో హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

