తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
ఆరుగాలం శ్రమించి పంట పండించినా అన్నదాతల కష్టాలు మాత్రం తీరటం లేదు. అతివృష్టి, అనావృష్టి వంటి సమస్యలతో పాటు రైతులకు వివిధ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం వారిని తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాట రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా, పంటకు తగిన మద్దతు ధర దొరకటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
టమాట ధరల పతనం
పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో షాకింగ్ నిర్ణయాలను తీసుకుంటున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలించినా కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా రాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 80 వేలు నుండి లక్ష రూపాయల వరకు పంటకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు కనీసం రవాణా ఖర్చులు కూడా రావటం లేదని అంటున్నారు.

ధర లేని టమాటా.. రైతు షాకింగ్ నిర్ణయం
తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మార్కెట్ లో ఒక రైతు టమాట పంటను మార్కెట్ కు వచ్చిన వారికి ఫ్రీగా పంచటం రైతుల ఆవేదనకు అద్దం పడుతుంది. నిన్న గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన ఒక రైతు తన టమాటా పంటను మార్కెట్‌కు తీసుకువచ్చినట్లు, మార్కెట్‌లో కిలో 5 రూపాయలకు కొనుగోలు చేసిన వ్యాపారులు అసహనానికి గురైన రైతు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రీగా టమాటాలు పంచిన రైతు
ఆటోలో అంత దూరం తెచ్చిన టమాటాలను మళ్ళీ ఇంటికి తీసుకు వెళితే మళ్ళీ రవాణా చార్జీల భారం పడుతుందని భావించిన రైతు అక్కడ ప్రజలకు టమాటలను ఉచితంగా పంచారు.
దీంతో టమాటాలు ఫ్రీగా ఇస్తున్నాడని టమాటాల కోసం అక్కడ జనాలు ఎగబడ్డారు. ఇక కొందరు రైతులు మార్కెట్ కు తెచ్చే సాహసం కూడా చెయ్యటం లేదు.
బయట టమాట ధర 20 రూపాయలకు పైనే
గిట్టుబాటు ధర లేక టమాటా సాగు చేసిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల దగ్గర వచ్చేసరికి ధరలు లేవు కానీ మార్కెట్‌లో వినియోగదారులకు మాత్రం టమాటా ధరలు 20 రూపాయలకు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

